సూర్యవంశీ సరికొత్త చరిత్ర.. ఒక రికార్డు మిస్సయినా మరో రికార్డు బద్దలు!

  • క్రిస్ గేల్ ఆల్‌టైమ్ సిక్సర్ల రికార్డుకు తెరమరుగు
  • చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
  • ఒకే టీ20 టోర్నీలో 65 సిక్సులు కొట్టిన తొలి ఆటగాడు
  • టీ20 టోర్నీలో 600 పరుగులు చేసిన తొలి టీనేజర్‌గా మరో రికార్డు
  • సన్‌రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల యువ కెరటం, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు చేజార్చుకున్న సూర్యవంశీ.... మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ 14 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టాడు.

2012 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున క్రిస్ గేల్ 59 సిక్సులు బాదగా, ఇన్నాళ్లూ అదే రికార్డుగా కొనసాగింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో తన సిక్సర్ల సంఖ్యను 65కి చేర్చుకుని గేల్‌ను అధిగమించాడు. అంతేకాకుండా, ఒక టీ20 టోర్నమెంట్‌లో 600 పరుగుల మైలురాయిని దాటిన తొలి టీనేజర్‌గా కూడా మరో ఘనతను అందుకున్నాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలోనే అతను ఈ ఫీట్ సాధించడం విశేషం.

ఈ బిహార్ కుర్రాడు పలు రికార్డులను తిరగరాశాడు. ఒక టీ20 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్‌గా దేవదత్ పడిక్కల్ (580) రికార్డును, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్‌గా తిలక్ వర్మ (397) రికార్డును కూడా వైభవ్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రిషభ్ పంత్, పృథ్వీ షా వంటి స్టార్లను సైతం వెనక్కి నెట్టాడు.

ఇక ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే, న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ జట్టులో శుభమ్ దూబే స్థానంలో రవీంద్ర జడేజా రాగా, సన్‌రైజర్స్ జట్టులో సలీల్ అరోరా స్థానంలో ప్రఫుల్ హింగే తుది జట్టులోకి వచ్చాడు.

Vaibhav Suryavanshi
IPL 2026
Rajasthan Royals
Chris Gayle
T20 record
Most sixes
Devdutt Padikkal
Tilak Varma
Sunrisers Hyderabad
Cricket

More Telugu News